Wednesday, 6 July 2022

మూడు సలహాలు..కథ

💐💐💐💐💐💐💐
ఒకసారి ఓ వేటగాడు ఒక అడవిలోకి పోయి, అక్కడ వల పన్నాడు. తను ఓ మూలగా నక్కి కూర్చున్నాడు- 'ఏమైనా పక్షులో, జంతువులో అటుగా వచ్చి వలలో చిక్కకపోతాయా' అని.
అంతలో అటువైపుకు వచ్చిందొక బుజ్జి పిట్ట. వస్తూ వస్తూనే అది కాస్తా వలలో చిక్కుకున్నది. చూసేందుకది చిన్నదే, కానీ దాని తెలివి అమోఘం. అది ఏమీ కంగారు పడకుండా వలలో అలాగే కూర్చున్నది.
వేటగాడు సంతోషంగా దాని దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. "బుజ్జి పిట్ట బలే రుచిగా ఉంటుంది" అనుకున్నాడు. అయితే వాడు దాన్ని చంపబోగానే, బుజ్జి పిట్ట వాడితో మాట్లాడింది- "వేటగాడా! ఓ సారి నామాట విను. నేను ఎంత చిట్టి పిట్టనంటే, నన్ను చంపి తిన్నంత మాత్రాన నీ ఆకలి చల్లారదు; నీ కడుపు నిండదు. దానికంటే నయం, నువ్వు నన్ను ఊరికే వదిలెయ్యి- అలా వదిలేస్తే, బదులుగా నేను నీకు అమూల్యమైన సలహాలు మూడు ఇస్తాను. అవి నీకు ఎనలేని మేలు చేస్తాయి. మొదటి సలహాను నేను ఇక్కడినుండే, నీ చేతిమీదే కూర్చొని- ఇస్తాను. రెండవదాన్ని నేను ఈ చెట్టు కొమ్మమీద కూర్చొని ఇస్తాను. మూడో సలహాను నేను ఆ చెట్టు మీద వాలి ఇస్తాను" అన్నది.
వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు- "నిజమే, ఈ‌ పిట్ట చాలా చిన్నది. దీన్ని తింటే కడుపేమీ నిండదు. దాని బదులు, ఇదేదో మంచి సలహాలు ఏవో ఇస్తానన్నది కదా, అవి తీసుకుంటే సరి. వాటి వల్ల నాకు ఎనలేని మేలేదో కలుగుతుందట కూడా! మరింకేమి?!" అని, పిట్టను వలనుండి తప్పించి చేతిలో పట్టుకున్నాడు.
పిట్ట అతనికి తన మొదటి సలహాను ఇచ్చింది: "ఎప్పుడైనాగానీ-సంభవం కాని మాటలు ఎవరు చెప్పినా సరే- నమ్మద్దు" అని.
"సరేలే" అన్నాడు వేటగాడు.
సలహా ఇచ్చేసాక పిట్ట ఎగిరి వెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నది. వేటగాడు ఇంకా మొదటి సలహా గురించి ఆలోచిస్తూండగానేతన రెండో సలహాను అందించింది: "జరిగిపోయినది ఏదైనా సరే- దాన్ని గురించి బాధపడద్దు" అని.
వేటగాడు సరే నన్నాడు, పరధ్యానంలోనే.
పక్షి వెంటనే అక్కడినుండి ఎగిరి వెళ్ళి ప్రక్కనున్న చెట్టు పైన వాలి, చెప్పింది- "చూడబ్బీ! నా పొట్టలో వంద గ్రాముల బంగారు ముక్క ఒకటి ఉంది. నువ్వు గనక దాన్ని దొరకపుచ్చుకొని ఉంటే, నువ్వొక్కడివే కాదు- నీ తర్వాత పది తరాల వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికి పోయేవాళ్ళు. నాకు నీ మీద ఎంత జాలిగా ఉందో చెప్పలేను- నువ్వు తొందరపడి నన్ను వదిలివెయ్యటం వల్ల, నీకు అందబోయిన సంపద ఆసాంతం పోయింది!" అని.
వేటగాడు నిర్ఘాంతపోయాడు . బాధ పడ్డాడు. "నువ్వు నన్ను మోసం చేశావు" అని మొత్తుకున్నాడు.
పక్షి నవ్వి, వేటగాడితో‌అన్నది- "చూడు, నీకు నేను ఇచ్చిన సలహాలు ఇంకా సరిగ్గా అర్థం అయినట్లు లేదు- 'జరిగిపోయింది ఏదైనా సరే, దాన్ని గురించి బాధ పడద్దు; ఎందుకంటే అట్లా బాధపడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు' అని చెప్పాను. మరి, నువ్వు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు?
అంతేకాదు- 'సంభవం కాని మాటలు ఎవరు చెప్పినా నమ్మద్దు' అని చెప్పాను. ఇందాకే కదా, నువ్వు నన్ను పట్టుకున్నది?- నా బరువు వంద గ్రాములు ఉంటే నీకు తెలీకపోయేదా? ఇంత చిన్న నా కడుపులో‌ వంద గ్రాముల బంగారం అసలు ఎట్లా చేరుకుంటుంది? అసంభవం కదా; మరి దాన్ని నమ్మకూడదు కదా?" అన్నది.
వేటగాడు సిగ్గు పడ్డాడు. "నిజమే. మంచి మాటలు విన్నంత మాత్రాన అవి మన ఆచరణలోకి వచ్చేస్తాయని లేదు. మంచిని ఆచరణలో పెట్టేందుకు కూడా‌ ప్రత్యేకించి ప్రయత్నించాలి. నువ్విచ్చిన సలహాలను అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నిసాను ఇకమీద" అన్నాడు. "మరి నువ్విచ్చే మూడో సలహా ఏంటి?" ఉత్సాహంగా అడిగాడు పిట్టను.
"మంచి సలహాలు వినగానే వాటిని ఆచరణలోకి తెచ్చేసుకోవాలి-లేకపోతే ఇక సలహాలు రావు" అని చెప్పి తుర్రున ఎగిరిపోయింది పిట్ట.

Friday, 1 April 2022

ఆహారంలో ఐదు విధాలైన దోషాలు

 ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయట


1.  అర్ధ దోషం ,

2.  నిమిత్త దోషం.             

3.  స్ధాన దోషం

4.  గుణ దోషం ,  

5.  సంస్కార దోషం.


ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 


 అర్ధ దోషం:

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.

విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. 

మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 


నిమిత్త దోషం:

 మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 

నా స్వీయ బుధ్ధిని ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను 

ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *'నిమిత్త దోషం '* ఏర్పడుతోంది.


 స్ధాన దోషం:

స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని తల్లి సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు తల్లి వైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో 

కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 


గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది...


                              🍁🍁🍁🍁