Wednesday, 21 April 2021

రావణుని లాంటి తమ్ముడు అయితే ???


🔥 ఒక గర్భవతి అయిన స్త్రీ 👩🏻తన కూతురుకి తమ్ముడు కావాలా ? చెల్లి కావాలా ? అని అడిగింది


👧🏻 కూతురు: తమ్ముడు కావాలి


👩🏻 తల్లి: ఎలాంటివాడు కావాలి


👧🏻 కూతురు: రావణుడు👹 లాంటి వాడు కావాలి


👩🏻 తల్లి: ఏంటి నువ్వు మాట్లాడుతుంది ? నీకు ఏమైనా మతి పోయిందా ?


👧🏻 కూతురు: రావణుని👹లాంటి వాడు అయితే ఏమైందమ్మా ?

అతడు తన చెల్లిని అగౌరపరిచారని బంధాల్ని,చివరకి రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు.

శత్రువు భార్యని కూడా ఎత్తుకొచ్చాడు,కానీ కనీసం తాకలేదు

నేను రావణుడి 👹 లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోకూడదు


పోనీ రాముడి 🏹🙎🏻‍♂ లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోవాలి

ఎప్పుడూ తన నీడలా పక్కనే ఉండే భార్యని గర్భవతి అని కూడా చూడకుండా ఒక రజకుడి మాట విని అగ్ని పరీక్ష పెట్టాడు


14 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్లి అష్టకష్టాలు పడేటట్లు చేశాడు


అందుకా…?


ఇప్పుడు చెప్పు అమ్మ నీకు రాముడు కావాలా? రావణుడు కావాలా?

రాముడికి భార్యగా ఉంటావా ? రావణుడికి చెల్లిగా ఉంటావా ?


ఇప్పటికీ రాముడే 🏹🙎🏻‍♂ కొడుకుగా పుట్టాలి అనుకుంటున్నావా ?


👩🏻తల్లి కళ్ళల్లో నీళ్ళు చెమర్చాయి.


విచిత్ర  వితండ వాదం అంటే ఈ పైన చెప్పిన కధ...


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂


ఇప్పుడు  పైన కథలో  విషయాల పై విశ్లేణాత్మక వివరణ చూద్దాం 


అతడు తన చెల్లిని అగౌరపరిచారని బంధాల్ని,చివరకి రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు.

⭕ 👉 చెల్లి ( శూర్పణఖ )   కోరిక కామంతో కూడుకున్నది. ముందుగా రాముడిని తన కోరిక తీర్చమంది, ఆనక లక్షమనుడిని కోరింది.ఇది పాపం.  రాక్షస స్త్రీ అయినా చంపకుండా ముక్కు చెవులు కోసి దండించి వదిలేసారు. దీనిని చెల్లికి పరాభవం అనుకోవడం రావణుడి సహజ గుణం (  రాక్షసుడు  కనుక  ) చెల్లి విషయంలో రావణుడు ఉత్తముడిలా ఆలోచించి ఉంటే చివరాఖరికి రాముడి చేతిలో చచ్చేవాడే కాదు.


ఇక్కడ జరిగిన విషయం అంతా వివరంగా తెలుసుకొని చెల్లిని మందలించాల్సింది పోయి కొరివితో తల గోక్కున్నాడు రావణుడు.


రావణుడు బంధాల్ని రాజ్యాన్ని వదులుకోలేదు … ” పోగొట్టుకున్నాడు ”  అని గమనించాలి.


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂


2. శత్రువు భార్యని కూడా ఎత్తుకొచ్చాడు,కానీ కనీసం తాకలేదు.


ఛి …. దరిద్రం కాకపొతే మరెంటండి… ఇందులో నీతి ఎక్కడ ఏడ్చింది??


రావణుడు నిజంగా దమ్మునవాడు అయితే వనవాసంలోనే.. సితని పరాభవంచేసి ప్రతీకారం తీర్చుకోవాల్సింది. లేదా


అక్కడే రామునితో యద్ధం చేసి రామ లక్ష్మణులను ఓడించి  సీతని గెలిచి తెచ్చుకోవాల్సింది.


అలాకాకుండా .. మారీచునితో నాటకం ఆడించడం ఏంటి ? రామ లక్ష్మణులు లేని టైం లో రావడం ఏంటి ? అందునా దర్జాగా రావనుడిలా కాకుండా బిచ్చగాడిలా రావడం ఏంటి ? ఇందులో ఎక్కడ రావణుడి గొప్పతనం కనబడింది ???


🌻🌻🌻🍂🍂🍂🌻🌻🌻


ఎంటేంటి ??? ఎత్తుకొచ్చాడు కానీ కనీసం తాకలేడా ?


కిడ్నాప్ చేయడం నీకు తప్పు అనిపించలేదా ??? పర స్త్రీలను ఎవరైనా అలా ఎత్తుకురావచ్చా ?? అందులో మీకు దోషం కనబడలేదా ??


ఎందుకు తాకలేదో తెలుసా ?? రావణుని అత్యాచారా భాదితురాళ్ళందరూ బ్రహ్మ గారితో  మొరపెట్టుకుంటే …. ఆయన శపించారు వాడిని …. నువ్వు ఇంకో స్త్రీ ని కనుక బలాత్కరిస్తే … నీ తల పగిలి చస్తావు అని …. అందుకు తల్లీ వాడూ సీతమ్మని  తాక కపోవడానికి కారణం.


🌻🌻🌻🍂🍂🍂🌻🌻🌻


3 ) ఎప్పుడూ తన నీడలా పక్కనే ఉండే భార్యని గర్భవతి అని కూడా చూడకుండా ఒక రజకుడి మాట విని అడవుల్లో వదిలి పెట్టాడు .


నూటికి 99 మంది సీత పతివ్రత అని అనడం కాదు,  నూటికి నూరు మంది సీత పతివ్రత అనాలి ” అని అంతటి కటిన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అర్ధంఅయ్యిందా ???


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂


14 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్లి అష్టకష్టాలు పడేటట్లు చేశాడు.


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂




అవునా ?? అలా అని మీకు సీతమ్మ  చెప్పిందా?

వనవాసంలో రావణుడు వచ్చే క్షణం ముందు వరకూ సీతమ్మ రాముడితో చాలా సంతోషంగా  ఉంది. రాముడి ఎడబాటే ఆ తల్లికి నరకం. రాముడు వెంట ఉంటే ఎక్కడ ఉన్నా తను సంతోషంగా ఉంటుంది.


ఆ తల్లి కష్టాలు పడింది అంతా లంకలోనే … ఈ విషయం మీరు బాగా గమనించాలి .


రావణుడు ….  కుబేరునుకి బ్రహ్మ ఇచ్చిన విమానం పైన ఆశతో విమానం కోసం కుబేరునితో యుద్ధం చేసిన అత్యాశ పరుడు.


ఒకసారి పరమేశ్వరుని దర్శనం కోసం వెళ్లి తల్లి సమానమైన పార్వతి దేవిని కోరుకున్న కామాంధుడు.


ఫలితంగా శివుడు మంచి గునపాటమే చెబుతాడు.


పై ఆర్టికల్ లో అమ్మాయి రావణుడి లాంటి తమ్ముడిని కోరుతుంది అంటే ..తను కూడా శూర్పణఖలా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. తనుకూడా ధర్మ హీనంగా పర పురుషుడిని కోరుకుంటే తన తమ్ముడు రావనుడిలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తుంది అనుకోవచ్చు.

కూతురికి పురాణాల పైన అవగాహనలేదు అనుకోడానికి వీలు లేదు , ఎందుకంటే అన్ని పాత్రల గురించి చెప్పింది.


అంటే ..అవగాహన మాత్రమే ఉంది కానీ వివేకము లేదు అని కూడా మనం అర్ధం చేసుకోవాలి.


అందుకే  మనం మన పిల్లలకి మన పురాణాలు సరిఅయిన రీతిలో చెప్పకపోతే .. వాళ్ళు ఇష్టమొచ్చిన విశ్లేషణ చేస్తారు ... తస్మాత్ జాగ్రత్త..


*ఒక"అన్న"మయ్య కథ...*

 




ఆయనది యాయావార వృత్తి. యాయావారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే అడుక్కోవడం.


ఇల్లిల్లూ తిరిగి అడుక్కునేవాడు. తాను తినేందుకు కాదు. ఇతరు లకు పెట్టేందుకు.


ఇతరులెవరు? ఇతరులంటే భక్తులు. ఎక్కడెక్కడినుంచో రామచంద్రస్వామిని చూసేందుకు వచ్చే భక్తులు.


ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యను చూడటమంటే మాటలా? 


https://youtu.be/um9Nx6g5Anw


బస్సులు, కార్లు, రైళ్లు లేని రోజులవి.అశ్వారావుపేట అడవులనో, పాల్వంచ అడవులనో దాటుకుని గోదారి అవతలి ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి పడవలో విశాల గోదావరిని దాటిరావాలి.


అందుకే భద్రాద్రికి వచ్చే సరికి భక్తులు అలసిపోతారు. సొలసిపోతారు. ఆకలితో అలమటిస్తూంటారు.


ఒడ్డున దిగి స్నానం చేయగానే ఆవిరులు చిమ్మే వేడివేడి అన్నం, కమ్మనిపప్పు, కాసింత మజ్జిగ, అయితే గియితే ఒక అవకాయ బద్ద.... అది దొరికితే చాలు. ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు అసలు రాముడిని ఆత్మశాంతితోచూడొచ్చు.


సరిగ్గా ఒడ్డుకి దగ్గరలో ఆయన అన్నం వండి పెట్టేవాడు. క్రమేపీ భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఈ రోజుల ఉడిపి హోటల్ కాదది. అంతా ఉచితమే.


ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకు ఇంకో ఆస్తి లేదు. రోజూ యాచించడం, తెచ్చింది వచ్చినవారికి వండి పెట్టడం. ఇదే అతని రామ సేవ. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద.

నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా.


ఒక సారి వంటపాత్రలు చోరీ అయ్యాయి. వంట వాళ్లూ పారిపోయారు. సరిగ్గా భక్తులు వచ్చే సమయం. ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. రామా లక్ష్మణా మీరే దిక్కు అనుకున్నాడు.


అంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. చేతుల్లో పెద్ద గుండిగలు (అన్నం వండే పెద్ద పాత్రలు). చకచకా అన్నం, పప్పూ వండేశారు. అందరికీ వడ్డించేశారు.


ఇంత రుచి ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నారు భక్తులు.


ఆయన వంటకుర్రాళ్లను చూసే సరికి వాళ్లు మాయమైపోయారు. కనుచూపుమేరలో కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. గుండిగలు మాత్రం మిగిలిపోయాయి.


ఆయనకిఅర్థమైపోయింది. వచ్చినవాళ్లు అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకి తెలిసిపోయింది.


శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన.


భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు.


హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు.


అయ్యా... నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు.


ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు. 

ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే.


సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు.అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు.


ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది. కొత్తగూడెం దాకా రైలూ వచ్చింది. ఇప్పుడు క్షణాల్లో భద్రాచలంలో వాలిపోవచ్చు. దేవుడిని చూసి వెళ్లిపోవచ్చు. ఆకలేస్తే అన్నం పెడతా అని పాడే హోటళ్లు వచ్చాయి . ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది. ఎవరూ పడవ దాటాల్సిన అవసరం లేదు. సత్రాన్ని కూడా అందరూ మరిచిపోయారు. సత్రం పాడుపడిపోయింది. గబ్బిలాల్లాంటి వాళ్లు వచ్చి చేరారు. నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగల్లేదు. ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది.


చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది.


ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ.


ఆయన పేరు పమిడిఘంటం వెంకటరమణ దాసు. 1850 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం.


తెలుగువాడు ఎప్పుడో ఒకప్పుడు భద్రాచలం చూడకపోడు. ఈ సారి రాముడిని, రామదాసును దర్శించుకున్నప్పుడు ఈ రమణదాసుని మరిచి పోకండి. కాస్త ఒపిగ్గా అడిగి అయినా సరే వెతుక్కుంటూ వెళ్లి అంబసత్రాన్ని చూడండి. ఎందుకంటే అక్కడ రెండు గుండిగలున్నాయి.


ఒకటి రామ గుండిగ

ఒకటి లక్ష్మణ గుండిగ.


(భూముల్నయితే దోచేసుకున్నారు కానీ గుండిగల్ని దోచుకునే ధైర్యం ఎవడూ చేయలేదు మరి)



జై శ్రీ రామ్🙏🙏


Monday, 19 April 2021

సుందరకాండ - 7

 దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా* 

 *పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్.* 



🍁🍁🍁🍁🍁🍁🍁


 


హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి " లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో. కాని దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు, అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదా వనాన్ని(అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు " అని అనుకొని, భీమరూపుడై ఆ అశోక వనం మీద ఎగిరాడు. అప్పుడాయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరారలోని నీళ్ళని బయటకి తోసేశాడు. 


అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు. 


అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దెగ్గరికి వచ్చి " ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం చూశాము. ఆ కోతి నీ దెగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు? " అని అడిగారు.


అప్పుడు సీతమ్మ అనింది " పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో, వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు " అనింది. 


అప్పుడా రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దెగ్గరికి వెళ్ళి " ఎక్కడనుంచి వచ్చిందో కాని మహా వానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలీదు. అది అశోక వనం అంతటినీ నాశనం చేసింది, కాని సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టేసింది. అలసట చేత వదిలిపెట్టిందో, కావాలని వదిలిపెట్టిందో తెలీదు. అలసట అని అనుకోడానికి వీలులేదు, ఎందుకంటే ఇంత అశోక వనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చెయ్యడం పెద్ద లెక్కా, అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సుని, కామాన్ని ఉంచావొ, ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది " అని చెప్పారు. 


అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరులని పిలిచి " మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతె సంహరించండి " అని చెప్పి పంపించాడు.


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|

హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||

అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|

సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||


(ఈ శ్లోకాలని జయ మంత్రము అంటారు)


ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయ మంత్ర శ్లోకాలని చెప్పాడు " రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు " అని జయ మంత్రాన్ని చెప్పాడు. 


అప్పుడా 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిసేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళి ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు, అప్పుడాయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనపడింది. అప్పుడాయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు. 


అప్పుడాయన " మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు.

సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు " అని చెప్పి మళ్ళి తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు. 


80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు, కాని ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు, ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళి ఒక పరిఘని పీకి, గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమి కనపడలేదు. మళ్ళి ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు, మోకాళ్ళతో కుమ్మేశాడు, చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు. 


" జంబుమాలి, జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు " అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన 7 మంత్రుల కొడుకులని హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపులనుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు, మిగిలినవారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడా ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది. 


వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది, అప్పుడాయన 5 సేనాగ్ర నాయకులని పిలిచి " మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి, అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను, వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహా భూతం అయ్యి ఉంటుంది " అన్నాడు. విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే 5 సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ పచ్చడయిపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు, అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. తరువాత మిగిలిన ఇద్దరినీ సంహరించాడు.


ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్ష కుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే ' ఈ పిల్లవాడు ఎంత బావున్నాడు రా, చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము ' అని హనుమంతుడు అనుకున్నాడు. అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్ష కుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు ' దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కాని ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటె ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే ' అనుకొని, ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దద్ది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథం, సారధి చనిపోయారు కాని అక్ష కుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి, ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్ష కుమారుడి పాదాలని పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు. ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి, తలకాయి వెయ్యి ముక్కలయ్యింది, కడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి. 


తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటె ఏంటో, భయం అంటె ఏంటో తెలిసొచ్చింది. అప్పుడాయనకి ఎవరిని పంపాలో అర్ధం కాక ఇంద్రజిత్ వంక చూసి " నిన్ను పంపకూడదు, కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడంలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకా పట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది. ఒకసారి అస్త్రాలన్నిటిని మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనాసరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకొ, అవకాశం దొరికితే వాడిని సంహరించు " అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు.

ఇంద్రజిత్, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి, అ


నుకొని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం( ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు) జ్ఞాపకం వచ్చి ' ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కాని నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను ' అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసి, కర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు ' ఇలా ఈ రాక్షసులని ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను ' అనుకొని అలా ఉండిపోయాడు. 


కాని ఇంద్రజిత్ అనుకున్నాడు ' ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్భంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళి సూర్యోదయం అయ్యేవరకు పనిచెయ్యదు. ఇప్పుడీయన తలచుకుంటె ఏమన్నా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలీలేదు, వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు " అని అనుకొని సంతోషపడ్డాడు. 


వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దెగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కాని, ఒక కాటుక కొండని కాని తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో, అలా రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చెయ్యబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి " ఎక్కడినుంచి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎవరివాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి " అన్నాడు.


అప్పుడు ప్రహస్తుడు లేచి " నువ్వేమి భయపడకు. మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడ? యముడు పంపించాడ? కుబేరుడు పంపించాడ? విష్ణువు పంపించాడ? ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనం చేశావు? " అని ప్రశ్నించాడు.


అప్పుడు హనుమ రావణుడి వంక చూసి " ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, నిజంగా వీడి దెగ్గరే కాని మహా పతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతె వీడు మూడు లోకములను శాసించగలిగినవాడు కదా " అన్నాడు.


హనుమని చూసిన రావణుడు భయపడి ' ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు, ఇంతకముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను, కాని వాళ్ళెవరికి ఇంత పరాక్రమము, సామర్ధ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాశ పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, ' వానరులు నా కొంప ముంచుతాయని '. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో ' అనుకొన్నాడు. 


అప్పుడు హనుమంతుడు అన్నాడు " నేను రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా యదార్ధ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు, సుగ్రీవుడి సచివుడిని. కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు, ఆ సుగ్రీవుడు నీ కుశలమడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైనవాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను, విన్నావ బాగుపడతావు, లేకపోతె నాశనమయిపోతావు. నిన్ను చూడడానికి వేరొక ఉపాయము లేదు, అందుకని దండోపాయంతో అశోక వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు, దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను, వాళ్ళు చనిపోయారు. 


పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడం కోసం లక్ష్మణుడు, సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలొ పెట్టావు, సీతమ్మ ఎవరో నాకు తెలీదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను, నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ అయిదు తలల పాము, నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు, సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు.

రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉంది, కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు ' నర వానరములతో తప్ప ' అని బ్రహ్మగార


ిని వరం అడిగావు కదా, సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు, ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు, వేల మంది కాంతలతో సుఖాలని అనుభవించావు, ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కాని నువ్వు ఇవ్వాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్ర శస్త్రములు తెలుసు, ఋషుల దెగ్గర శిక్షణ పొందినవాడు, మహా ధర్మాత్ముడు, అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు లక్ష మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు. 


ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటె, శివుడు తన కాలి బొటను వేలితొ ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సుని రాముడు హేలగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులని జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా. అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు, నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు " అన్నాడు.


ఒక నిండు సభలొ తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి " ఈ వానరాన్ని చంపెయ్యండి " అన్నాడు.


అప్పుడు విభీషణుడు లేచి " అన్నయ్య! నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి, అవి తల గొరిగించడం, అవయవాన్ని తీసెయ్యడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలివారికి ఎలా తెలుస్తుంది. అందుకని వచ్చిన దూతని చంపద్దు " అన్నాడు.


విభీషణుడి మాటలు విన్న రావణుడు " వానరాలకి తమ తోక అంటె చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపినవారి దెగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి ' తోకలేని కోతి, తోకలేని కోతి ' అని ఏడిపిస్తారు " అన్నాడు.


అప్పుడు వాళ్ళు పాట బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ ' గూఢచారి, గూఢచారి ' అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు. 


అప్పుడు హనుమంతుడు ' వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళలొ ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను ' అనుకున్నాడు. వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు. 


అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు " అన్నారు.


సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి " నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటె, రాముడికి నామీద ప్రేమ ఉంటె, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక " అనింది.


వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు ' అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు ' అని అనుకుని, ' ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను ' అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ " హా తాత, హా పుత్ర, హా తల్లి " అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు.

అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది. 


అప్పుడాయన " అరరే ఎంతపని చేశాను. అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు


కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదొ, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుంద. సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుంద " అని అనుకున్నాడు. 


ఇంతలో అటుగా వెళుతున్న చారణులు(భూమికి దెగ్గరగా ఆకాశంలొ ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) " ఏమి ఆశ్చర్యం, ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కాని శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జెరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకి కూడా ఏమి జెరగలేదు " అన్నారు.


అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి " అమ్మా లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతె వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జెరుగుతుంది, శోకమునకు గురికాకు " అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడినుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది.


🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శోషిత సరిదీశార్థిత రామ

విభీషణాభయ దాయక రామ

పర్వతసేతు నిబంధక రామ

కుంభకర్ణ శిరచ్ఛేదక రామ

రాక్షససంఘ విమర్దక రామ

అహి మహి రావణ చారణ రామ

సంహృత దశముఖ రావణ రామ

విధి భవ ముఖ సుర సంస్తుత రామ

ఖస్థిత దశరథ వీక్షిత రామ

సీతాదర్శన మోదిత రామ

అభిషిక్త విభీషణ నత రామ

పుష్పక యానారోహణ రామ

*సుందరకాండ* 6

 *శ్రీ రాఘవం* 

 *దశరథాత్మజమప్రమేయం* 

 *సీతాపతిం రఘుకులాన్వయ* 

 *రత్నదీపమ్* 

 *ఆజానుబాహుమరవింద* 

 *దళయతాక్షం* 

 *రామం నిశాచర వినాశకరం* 

 *నమామి* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁




తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జెరుగుతుందని అంటారు) " లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి " అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ' అసలు నాకు నిద్ర వస్తేకద కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను ' అనుకుని మళ్ళి పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు. 


అప్పుడు సీతమ్మ అనింది " ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక " అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది. 


అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి " అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్మమ్మా " అన్నాడు.


సీతమ్మ అనింది " ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను " అనింది.


అప్పుడు హనుమంతుడు " అమ్మా! నువ్వు దేవతలకి చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వులకు చెందినదానివా, కిన్నెరులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా. నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి, కనుక నువ్వు దేవతా స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు కచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాని జనస్థానంలో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా? " అన్నాడు.


సీతమ్మ " ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన, శత్రుసైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని, నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో 12 సంవత్సరాలు హాయిగా గడిపాను. కాని 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేర దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు " అనింది.


' సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది ' అని హనుమంతుడు అనుకొని ఆమె దెగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళి మూర్చపోయింది. కొంతసేపటికి తేరుకొని అనింది " నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి, మళ్ళి రూపం మార్చుకొని వచ్చావు " అనింది. 


కాని సీతమ్మ మనస్సులో ' ఏంటో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించడం లేదు. మనస్సులోనుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అటువంటివాడు కాదు అనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్ర వాత్సల్యం కలుగుతుంది ' అని అనుకొని, " నాయనా! నువ్వు ఎవరివో యదార్ధంగా నాకు చెప్పు " అనింది.


అప్పుడు హనుమంతుడు " అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు, తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు, ఆ తరువాత సుగ్రీవుడి దెగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసినతరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు, సంభరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి, మా తల్లి అంజనా దేవి క్షేత్రాముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడివంటి వాడను. నేను రామ దూతని తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ " అన్నాడు.


అప్పుడు సీతమ్మ అనింది " నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటె నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ బక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు? " అనింది.


 *రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా|* 

 *రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ||* 


హనుమంతుడు అన్నాడు " రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. 


 *రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః|* 

 *రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే ||* 


రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి, ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి. 


 *తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః|* 

 *బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః ||*

తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహ


స్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు " అని చెపుతూ, రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. (ఆ సమయంలోనే రాముడు 96 inches(8 feet) ఉంటాడని హనుమంతుడు చెప్పాడు.)


అలానే " అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు, ఏ లోకంలో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటె. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు. 


 *వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః|* 

 *రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం||* 

 *ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా|* 

 *సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి||* 


( ఈ శ్లోకాలు పరమ

 పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)


అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామ రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను, నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు " అన్నాడు.


హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై, ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.

హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ " నాయన హనుమ! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా " అని పలు ప్రశ్నలు అగిగాక, " రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలొ అలా ప్రవర్తించడంలొ వైక్లవ్యాన్ని పొందలేదు కదా?. రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడ, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడ? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నాన, నన్ను తలుచుకుంటున్నాడ. రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు " అనింది. 


సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని " ఎందుకమ్మా అలా ఖేద పడతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతొ ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటె, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే ' హ సీత, హ సీత' అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమం అయ్యాక సాధ్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తున్నాడు, ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దెగ్గర సచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దెగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడ ఎంత పరమపవిత్రంగా తీసుకెళతాడొ, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దెగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో " అన్నాడు. 


కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి " ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోన, నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావ. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా " అనింది.


సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతొ, బలిసిన తొడలతొ, సన్నటి నడుముతొ, విశాలమైన వక్షస్థలంతొ, శంఖంలాంటి కంఠంతొ, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతొ, పరిఘలవంటి భుజములతొ నిలబడ్డాడు.

హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి " నాయనా! నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుగ్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్ధు


డవు కాకపోతె రాముడు నిన్ను నా దెగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతె రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జెరగచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళి రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దెగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి " ఆనింది.


అప్పుడు హనుమంతుడు " ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా ' నేను రాను ' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దెగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి " అన్నాడు.


అప్పుడు సీతమ్మ అనింది " ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రామడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దెగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. (రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగు అపహరిస్తాడు, కాని సీతమ్మకి ఏదన్నా అపకారం జెరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు(వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. 


అప్పుడు కాకసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి ' సీత! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావ ' అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళి ఆ కాకసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చేసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ' ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు ' అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది. 


అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని(గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి(మంత్రపూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలె అవసరంలేదు, దేనిమీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది, ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దెగ్గరికి వెళ్ళింది, కాని అందరూ ' రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో ' అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు, ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).

రాముడు ఆ కాకిని చూసి ' నా దెగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టె. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చెయ్యాలి, మరి నువ్వు ఏమిస్తావు ' అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు. 


అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, దశరథుడికి నమస్కార


ం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు " అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.


తరువాత సీతమ్మ అనింది " శత్రువులను సంహరించగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జెరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కనింది, ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటె లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా! నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి " అనింది.


అప్పుడు హనుమంతుడు " అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితోపాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా, తీసుకువెళతాను " అన్నాడు.


అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడమణి సముద్రజలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు) ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సుయందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు, అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు, మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము " అనింది.


హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది. 


మళ్ళి సీతమ్మ అనింది " ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి " అనింది.


అప్పుడు హనుమంతుడు " నేను బయలుదేరతాను " అంటె, " నాయన! 10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, కాని ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామ కథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటె నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవ్వాళ ఉండి, రేపు నాకు కనపడి మళ్ళి ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా. ఇవ్వాల్టికి ఉండిపోవా హనుమా " అని, ఇంటినుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది. 


అప్పుడు హనుమంతుడు అన్నాడు " అమ్మ! నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీమీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు " అన్నాడు. 


అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళి శోకం కలిగిస్తోంది. రాముడు నాకోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది. హనుమ! నువ్వు వస్తావు, గరుగ్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు 100 యోజనముల సముద్రాన్ని దాటి. ఇంక ఎవరూ ఇక్కడికి రాలేరు, మరి రావణ సంహారం ఎలా జెరుగుతుంది? " అనింది.


మత్‌ విశిష్టాహ్‌ చ తుల్యాహ్‌ చ సంతి తత్ర వన ఒకసహ్‌ |

మత్తహ్‌ ప్రత్యవరహ్‌ కశ్చిన్‌ న అస్తి సుగ్రీవ సన్నిధౌ || 


హనుమంతుడు అన్నాడు " సుగ్రీవుడి దెగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, కాని నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దెగ్గర లేడమ్మా. (ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్సనం) నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి, రావణుడిని సంహరిస్తాము " అన్నాడు.


🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 కపివర సంతత సంస్మృత రామ

తద్గతి విధ్వ ధ్వంసక రామ

సీతా ప్రాణాధారక రామ

దుష్ట దశానన దూషిత రామ

శిష్ట హనూమద్భూషిత రామ

సీతా వేదిత కాకావన రామ

కృత చూడామణి దర్శన రామ

కపివర వచనాశ్వాసిత రామ

రామ రామ జయ రాజా రామ

రామ రామ జయ సీతా రామ

రావణ నిధన ప్రస్థిత రామ

వానరసైన్య సమావృత రామ