Saturday, 30 January 2021

*నీకు నువ్వే దీపం*


💐💐💐💐💐💐💐

ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతరు ఉంది. ఇంకొకతని దగ్గర లేదు. కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది.

దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు. కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే. 

లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు. కారణం దాని అవసరం అక్కడ లేదు. 

అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాకా ఒక నాలుగురోడ్ల కూడలికి చేరారు. అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది. అక్కడినించీ దార్లు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి.

లాంతరు ఉన్న వ్యక్తి కుడి వైపు తిరిగి వెళ్ళిపోయాడు. కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది.

లాంతరు లేని వ్యక్తి ఎడమ వైపుకి తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు. కారణం చీకటి. అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతను వెళ్ళిపోయాకా తన మార్గం అంధకారబంధురమయింది.

తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమయినా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధ పడ్డాడు.

*మనకు ఇతరులు కొంత వరకే మార్గం చూపిస్తారు. తరువాత మన దారి మనమే వెతుక్కోవాలి. చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపరు.* గురువు చేసే పనయినా అదే. *గురువు దగ్గరున్న కాంతి కొంత వరకే దారి చూపుతుంది.*

*శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నపుడు ప్రయాణం చివరి దాకా చేయగలడు.*

*నీకు నువ్వే దీపం అని అనడం వెనక అర్థమదే*

మాలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు

 లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత. జేష్టాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరకి ఓ చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎంటంటే.. తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా.. వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు.


ఇక వాదించటం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జేష్టాదేవి, లక్ష్మీదేవిలు అతడిముందుకెళ్లి నిలుచున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత, దారిద్ర్య దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి, అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోటమాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో, బాధపడాలో కూడా అతడికి తెలియలేదు.

ఏదయితే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి.. ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. ఇంతకీ మీకిద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండని అడిగాడు. అప్పుడు జేష్టాదేవి, లక్ష్మీదేవిలు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి, ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు.

ఇద్దరినీ మెప్పించిన వ్యాపారి..!

"ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు. అయితే నిజాన్ని చెబితే జేష్టాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే.. తనను ఇంకా పేదవాడిని చేసేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి.. తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏంచేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు.

ఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే "అమ్మా ఓ మహాలక్ష్మీ...! నువ్వు ఇంట్లోంకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలోగానీ, స్వర్గలోకంలోగానీ ఎవరూ ఉండరు" అని అన్నాడు. అలాగే "అమ్మా ఓ జేష్టాదేవీ..! నువ్వు ఇంటినుంచి బయటికి వెళ్తుంటే నీ అందం, సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము" అని అన్నాడు. 

ఆ వ్యాపారి ఎవరి మనసులనూ నొప్పించని విధంగా చెప్పిన తీరు జేష్టాదేవి, లక్ష్మీదేవిలను సంతృప్తి పరచింది. అతడు ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడినుంచి మాయమయ్యారు.

ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే .. జేష్టాదేవి, లక్ష్మీదేవిలు ఎవరికివారు విజేతలమని అనుకుంటూ వెళ్లారేగానీ... నిజానికి నిజమైన విజేత వ్యాపారే. ఎందుకంటే.. అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందటమేగాక.. లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జేష్టాదేవిని సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారే..!

బ్రహ్మరాత

 అనగనగా ఒక శివుని దేవాలయం

ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలూ వస్తుంటారు
మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు
తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతాడు
ఆ విధంగా అందరు దేవతలూ గుడిలోకి వెళతారు
వాహనాలు గుడి బయట ఉంటాయి
అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరకు వచ్చి "యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం, అటువంటి యమధర్మరాజు గుడిలో కి వెళ్లేముందు నన్ను చూసి నవ్వాడు. నాకు భయంగా ఉంది నన్నెలాగైనా కాపాడు" అని గరుత్మంతుడిని వేడుకుంది.
అప్పుడు గరుత్మంతుడు "నేను అన్నిటికన్నా వేగంగా పోగలను, మూడు ఘడియలలోపు నిన్ను ఏడు సముద్రాలకు అవతల వదిలి వస్తాను, అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు యముడు నిన్నేమీ చేయలేడు" అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకెళ్ళి ఏడు సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి 'నీకేం కాదులే హాయిగా ఉండు' అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు.
కొంత సేపటికి దేవతలందరూ పూజ ముగించుకుని బయటకు వస్తారు.
అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో " యమధర్మరాజా నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట ఎందుకు" అని అడిగాడు.
అప్పుడు యమధర్మరాజు " ఏం లేదు నాకు బ్రహ్మ దేవుడు రాసిన అందరి తలరాతలూ కనిపిస్తాయి, ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది" అని అన్నాడు.
ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు
"ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలో ఏడు సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతోంది అని రాసి ఉంది, ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలోపు ఏడు సముద్రాలు దాటి వెళ్లలేదు, ఆ పాము కూడా ఏడు సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది" అన్నాడు యమధర్మరాజు
తానొకటి తలచిన దైవమొకటి తలచు.

Thursday, 28 January 2021

ఈ అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి

 .


🍁🍁🍁🍁


వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..


🔸 అతినిద్ర

🔸 బద్ధకం

🔸 భయం

🔸 క్రోధం

🔸 అలసత్వం

🔸 ఎడతెగని ఆలోచన


...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. 


ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..


 నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. 


 రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. 


అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. 


 ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.


అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. 


అలాగే.. 


ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.



🌸  జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁🍁

కాకి, కోకిల



ఒక పెద్ద మామిడిచెట్టు మీద ఒక కాకి, ఒక కోకిల నివసిస్తూ ఉండేవి. 


చాలా కాలంగా మంచి స్నేహితులు అవి. 


కోకిల తన గుడ్లను కాకి గూట్లోనే పెట్టేది. ఒకవైపున కాకి వాటిని పొదుగుతుంటే, కోకిల మాత్రం ఆ చుట్టుప్రక్కల పాటలు పాడుకుంటూ తిరిగేది.


ఒకరోజున బాటసారి ఒకడు అటువైపుగా పోతూ  అలసి పోయి చెట్టు క్రిందే గడుపుదామని అనుకున్నాడు.


 ఆ సమయంలో కోకిల పాట పాడటం మొదలు పెట్టింది. ఆ పాట వింటూ చల్లగా హాయిగా నిద్రపోయాడు బాటసారి.


కాసేపటికి కాకి నిద్రలేచింది. 'కావ్!కావ్!' అని గట్టిగా పాట పాడటం మొదలుపెట్టింది. 


క్రింద నిద్ర పోతున్న బాటసారి ఆ పాట విని గబుక్కున నిద్రలేచాడు. కొంచెం చిరాకుగా లేచి నిలబడి , అటూ ఇటూ చూశాడు. తొందర తొందరగా నడచుకొని వెళ్లిపోయాడు.


'నీ పాట తో హాయిగా నిద్రపోయాడు, అందరూ నిన్నే మెచ్చుకొంటారు; నన్ను అసహ్యించుకొంటారు.. నేను నీ గుడ్లను పొదగను...అంటూ  కోపంగా  కాకి అరిచింది గట్టిగా.


"ఎందుకు అక్కా, అలా అరుస్తావు? ఆ బాటసారి వెళ్ళిపోయాడనే కదా, ..నేను వెళ్ళి ఆ బాటసారినే అడుగుతాను- అతను ఎందుకు చికాకు పడ్డాడో!" అని కోకిల బాటసారిని వెతుక్కుంటూ పోయింది.


దూరంగా నడుచుకొంటూ‌పోతున్నాడు బాటసారి. 


కోకిల ఎగురుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి- "అయ్యా! కాకి పాట పాడితే మీరు అక్కడ నుండి వెళ్లిపోయారట, ఎందుకు? మీరు తనని అవమానించారని నొచ్చుకున్నది కాకి. అది ఇప్పుడు నన్ను, నా గుడ్లను అసహ్యించుకుంటున్నది" అన్నది.



"అయ్యో అలాగా! నేను మాట్లాడతాను ఆగు, కాకితో" అని బాటసారి వెనక్కి తిరిగి చెట్టు దగ్గరకెళ్ళాడు.


ముఖం ముడుచుకొని కూర్చున్న కాకితో అతను అన్నాడు- "కాకమ్మా! నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే కోకిల గొంతు చాలా బాగా వుంటుంది, నీ గొంతు అంత బాగుండదు. అందుకే నేను నీ పాట వినబడగానే అక్కడి నుండి లేచి వచ్చేసాను.


అయినా మీరు ఇద్దరూ చాలా మంచి స్నేహితులని అందరూ అంటుంటే విన్నాను. అట్లాంటి మీరు గొడవ పెట్టుకున్నారా? 


నీ గొంతు బాగుండదు; కోయిల బాగా పాడుతుంది- అయితే మాత్రం ఏమిటట? కేవలం గొంతు బాగున్నంత మాత్రాన అది గొప్పదయిపోతుందా?


 దానికసలు పిల్లల్ని పొదగడమే తెలియదు గదా!? నువ్వే లేకపోతే దాని గతి ఏమికాను?


 ఎవరి గొప్పవారిది. దాని పాట విని నువ్వు ఆనందించాలి. తన పిల్లల్ని నువ్వు పొదుగుతున్నందుకు అది సంతోషించాలి!" అని.


బాటసారి మంచి మాటలకు కాకి ముఖం వికసించింది. 'అవును కదా, నేనేంటి ఇంత గొడవ చేశాను?' అనుకున్నదది. 



ఆనాటి నుండి కోకిల పాటలంటే కాకికి ఇష్టం; 

తన గుడ్లను చక్కగా పొదిగే కాకి అంటే కోకిలకు ఇష్టం!




🍁🍁🍁🍁🍁


పాపాన్నివారయతి యోజయతే హితాయ

గుహ్యం నిగూహతి గుణాన్ప్రకటీకరోతి ।

ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే

సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః ॥


నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో కవి ఈ పద్యంలో సూచిస్తున్నాడు. 


మనం పాపాలు చేసేటప్పుడు అతను నివారిస్తాడు; మంచిపనులు చేసే సమయంలో ప్రోత్సహిస్తాడు; రహస్యాలను దాచి ఉంచుతాడు; కానీ మనలోని సద్గుణాలను మాత్రం నలుగురిలో వెల్లడిస్తాడు; ఆపత్కాలంలో మిత్రుని వదిలిపోడు; ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాడు.


🍁🍁🍁🍁

మర్రి గింజలు




ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రి పండు కనిపించింది.  మర్రిపండుని  నోట కరుచుకుని ఎగురుతుండగా అది పక్షి నోటి నుండి జారి పడింది. మర్రి పండు పడిన ప్రదేశం ఒక గ్రామం  ప్రక్కన  ఉన్న మైదానం.  మర్రిపండు మైదానంలో పడిన రోజునే  బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండును కప్పేసింది. 


రెండు రోజుల తరువాత  మర్రి పండు విచ్చుకుని అందులో ఉన్న గింజలు బయట పడ్డాయి. మర్రి గింజలు వాటిలో  అవిమాట్లాడుకున్నాయి. ఒక గింజ సంతోషంగా  “మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనమింకా బ్రతికి ఉన్నాము. లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణం అయ్యేవారము అంది.  

 మరో గింజ “నిజమే. 

పక్షి కడుపులోకి వెళ్ళి  చనిపోయే వాళ్ళం. ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అని చెప్పింది.  మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి.  


మరో రెండు రోజులు గడిచేసరికి  ఒక గింజ నుండి మొలక  వచ్చింది.  

 ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి మీరంతా చూడండి. నాకు మొలక  వచ్చింది అని చూపించింది.  


మొలకను చూసిన మిగతా గింజలు ఆ మొలకను లాగి పడెయ్యి.  మొలకెత్తావంటే నీ రూపం మారిపోతుంది.  భూమి మీద కొత్త  రూపంతో పెరుగుతావు.  ఎదిగే క్రమంలో  ఎన్నో కష్టాలు పడాలి.  కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు. 

మరికొన్ని సార్లు  పశువులు తొక్కి చంపుతాయి.  లేదా నమిలి మింగుతాయి.  ఇవన్నీ దాటుకుని  మొక్కగా పెరిగాలి. ఒకవేళ  ఎదిగావనుకో, కావలసినంత  నీరు అందాలి. అలా నీరు దొరకకపోయినా   ఎండిపోయి చస్తావు.  అన్ని కష్టాలు పడలేవు కానీ మాలాగా గింజ రూపంలోనే ఉండిపో.  మనమంతా  హాయిగా కలసి గడుపుదాం అన్నాయి. 


 మిగతా గింజల  మాటలు ఆలకించింది కానీ  మొలక వచ్చిన గింజ జవాబు చెప్పలేదు.   తన మొలకను వేరు చేయలేదు. కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీదకు వచ్చి ఎదగడం ప్రారంభించింది. దాని కాండం నిటారుగా ఎదిగింది. కొమ్మలు  ప్రక్కలకు పెరిగాయి. ఎన్నో  ఆకులు మొలిచాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పెద్ద  వృక్షంగా ఎదిగింది.  


ఎండ వేడి నుండి రక్షణ కోసం రైతులు, బాటసారులు మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పశువులు, జంతువులు రాత్రి వేళల్లో, వర్షం కురిసినప్పుడు చెట్టు క్రింద తల దాచుకునేవి. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకున్నాయి. మర్రి చెట్టు నిత్యం ఎందరికో ఆశ్రయం ఇస్తుండడం వలన అక్కడ సందడిగా ఉండేది. 


అప్పుడప్పుడు వైద్యులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి  

మర్రి బెరడు, 

పాలు , 

ఆకులు, 

మొగ్గలు కోసుకుపోయే వారు. 

వాటిని వైద్యం కోసం ఉపయోగించేవారు.  


మైదానానికి ఆడుకోవడానికి  వచ్చే పిల్లల్లో కొందరు  మర్రి ఊడలతో  ఊయల ఊగి ఆనందించేవారు.  అవన్నీ చూసి మర్రిచెట్టు సంతోషించేది.  

అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.   


ఒక రోజు భయంకరమైన తుపాను వచ్చింది. చాలా బలమైన గాలులు వీచాయి. ఏకధాటిగా వానలు కురిసాయి.  తుపాను ధాటికి ఎన్నో వృక్షాలు నేలకొరిగాయి. అప్పుడే   మర్రి వృక్షం కూడా  నేలకు ఒరిగింది.  మర్రి వృక్షం అలా ఒరిగిపోయినందుకు ప్రజలు ఎంతగానో   బాధపడ్డారు. మర్రిచెట్టు  కొమ్మల మీద నివసించే  పక్షులు , 

జంతువులు మూగగా  రోదించాయి.    

మరికొన్ని  రోజులకు  మర్రి  చెట్టు పచ్చదనం తగ్గిపోగానే  గ్రామస్తులు  గొడ్డళ్లతో  నరికి చెట్టు కొమ్మలను, కాండాన్ని వంట చెరుకుగా, గ్రుహోపకరణాలుగా వాడుకున్నారు. కలప మోసుకు వెళుతున్న వారు  బ్రతికినప్పుడే కాకుండా  చనిపోయాక  కూడా ఉపయోగపడిందని చెప్పుకున్నారు.  


స్వార్ధంతో  గింజలుగా భూమిలోనే ఉండిపోయిన మిగతా గింజలు  తమ సోదరుడికి లభిస్తున్న ప్రశంసలు విని సంతోషించాయి. మరో వైపు సిగ్గుపడ్డాయి.


 వాటిలో  ఒక గింజ మనమంతా దిద్దుకోలేని పొరపాటు చేసాము. ఎలా పుట్టామో అలాగే మిగిలిపోయాము.  ఎవరికీ "ఉపకారం" చేయలేకపోయాము.  మనల్ని గుర్తుపెట్టుకునే మంచి పని ఒక్కటి కూడా చేయలేకపోయాము. పుట్టిన  ప్రతి జన్మకూ  సార్ధకత ఉండాలి. మన జన్మ మాత్రం  వృధా అయింది.  పక్షి నోటి నుండి జారిపడి నందుకు మనం గొప్ప "అవకాశం" పొందినప్పటికీ   వృధా చేసుకున్నాము . మన సోదరుడు మాత్రం మంచి పని చేసాడు. మరణించి కూడా జనం  గుండెల్లో, వారి ఇళ్లల్లో నివాసం ఏర్పరుచుకున్నాడు. జీవితమంటే మన సోదరుడిదే అంది. 


అది విన్న మరొక మర్రి గింజ కొందరు  పిరికితనంతో బ్రతుకుతారు. ఇప్పుడు మనం చేసిన తప్పే చేస్తుంటారు.  ఇతరులకు మేలు చేసే జీవితం వలన తృప్తి కలుగుతుందని తెలుసుకోలేక  జీవితాన్ని  వృధా చేసుకుంటారు. ప్రక్కవారికి చేసే  సేవల వలన చిరస్థాయిగా పేరు నిలుస్తుందని తెలుసుకుని ఒకరికొకరు సాయపడుతూ బ్రతికితే ఎంతో బాగుంటుంది” అంది. 




జరిగిపోయిన దాన్ని వెనక్కు తీసుకురాలేము కాబట్టి ఇతరులకు  సహాయపడినప్పుడే ఈ జన్మ కు సార్థకత.


🪴🪴🪴🪴🪴🪴🪴🪴


పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।

పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥


వృక్షాలు ఫలాలనిస్తాయి. కానీ అవి తినవు. అవి అన్నియూ మనుషులకే ఉపయోగిస్తాయి.

Tuesday, 26 January 2021

మనసెరిగిన మాధవుడు..

 గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది.

ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?
నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది.
మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.
ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు.
అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.
ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు.
తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.
కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.
భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.
ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటప్న
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

నెగిటివ్ అంశాన్ని,పాజిటివ్ గా స్వీకరిస్తే!!

 ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చదవసాగింది.. నిశ్శబ్దంగా!*

*నెగిటివ్ ఆలోచనలు!!!*
*"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...*
*"ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఋణం తీరిపోయింది*
*"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.
*"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.
*"దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!"
*చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది.
*కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.
*ఆయనకి మెలుకువ వచ్చింది. తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద రాసి ఉన్నది చదివాడు.
*పాజిటివ్ గా ఆలోచిస్తే!!!
*"గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పికి ఎట్టకేలకు ముగింపు పలక గలిగాను.
*"ఈ ఏడాది లోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను.
*"ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ప్రశాంతంగా సహజమరణం చెందారు.
*"ఈ ఏడాదిలోనే నా కొడుకుకు కొత్త జీవితం వచ్చది. కారు పోతే పోయింది గానీ నా కొడుకు ఎలాంటి సమస్యా లేకుండా పెద్ద గండం నుండి బయట పడ్డాడు.
*"హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"
*అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....
*ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.*
☀️☀️☀
*మంచి,చెడు అనేవి మన ఆచనా సరళే.మన ఆలోచనా సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అదే కదా ఆనందమయమైన జీవితం?*

Monday, 25 January 2021

పులి గెలిచిందా

 ✍️...నేటి చిట్టికధ



ఒకరోజు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఒక బ్రాహ్మణుడు. 


ఊరుదాటి నాలుగడుగులు వేశాడో, లేదో అతనికొక గొంతు వినిపించింది-


"అయ్యా! బ్రాహ్మణోత్తమా! దేవుడిలాగా వచ్చావు. దాహంతో నా నోరు పిడచకట్టుకు పోతున్నది. కొంచె సాయం చెయ్యి. ఒక్కసారి నన్ను బయటికి వదులు. నీకు పుణ్యం ఉంటుంది" అని.


బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా కలయజూశాడు. గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది, ఒక పెద్ద పులి!


"పులీ, నిన్ను వదలగానే నువ్వు నా మీదికి దూకి నన్నే చంపి తినేస్తావు. అందుకని నన్ను క్షమించు, నీకు నేను ఎలాంటి సాయమూ చేయలేను" అన్నాడు బ్రాహ్మణుడు దానితో, చాలా మర్యాదగా.


"అయ్యో అయ్యో! అలా అనకు! ఒట్టేసుకొని చెబుతున్నాను- 

 నువ్వు నన్ను కాసేపు విడిస్తే నేను కాసిని నీళ్ళు త్రాగి, మళ్ళీ వచ్చి ఈ‌ బోనులోనే కూర్చుంటాను.పరమ పవిత్రుడైన ఒక బ్రాహ్మణుడిని- అందునా నాకు సాయం చేసినవాడిని- చంపటానికి నేనేమైనా అంత తెలివి తక్కువ దాన్నా? నా అంతరాత్మమీద ప్రమాణం చేసి చెబుతున్నాను- నేను నీకు ఎలాంటి అపకారమూ చెయ్యను. నన్ను కాపాడు- నీది జాలిగుండె. నీ కళ్ళముందే ఒక మూగప్రాణి నిష్కారణంగా దాహంతో చచ్చిపోతే నీ‌ ఆత్మ క్షోభించదా, నన్ను ఒక్కసారి బయటికి రానియ్యి చాలు- నీ‌ మేలు మరువను" అన్నది పులి.


ఆ సరికి బ్రాహ్మణుడు బాగా మెత్తబడ్డాడు. "మళ్ళీ బోనులోకి వెళ్ళి కూర్చుంటానని మాట ఇస్తున్నదిగదా, మరి ఇంకేమి నష్టం? పాపం నోరు లేని ప్రాణి! దాహంతో‌చచ్చిపోతున్నది. కాసింత సాయం చేస్తాను. కష్టాలలో ఉన్న ప్రాణులకు సాయం చెయ్యాలని శాస్త్రంకూడా చెబుతున్నది" అనుకొని, అతను వెళ్ళి, మెల్లగా బోను తలుపుకున్న గడియ తీశాడు.


అంతే! మరుక్షణం 'ధడేల్'మని తలుపును నెట్టుకొని బయటికి దూకింది పులి! ఒక్క ఉదుటున బ్రాహ్మణుడి మీద పడి, పంజాతో అతని గొంతును పట్టుకొని- "హహ్హహ్హ! నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడివే కావొచ్చు; కానీ అత్యంత మూర్ఖుడివి! అందుకనే నా చేతికి చిక్కావు. ఇప్పుడు చక్కగా దైవప్రార్థన చేసుకో, చివరిసారి- ఎందుకంటే ఇంకాసేపట్లో నేను నిన్ను తినెయ్యబోతున్నాను. నిజంగా నాకు ఇప్పుడు దాహమే కాదు, విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది!" అన్నది పళ్ళు నూరుతూ.


బ్రాహ్మణుడికి ఆక్షణంలో తను చేసినది ఎంత మూర్ఖపు పనో అర్థమైపోయింది. కానీ మొండిగా అడిగాడు దాన్ని-"ఛీ! నువ్వూ ఒక పులివేనా, అసలు?!‌ ఇంత దిగజారిన పులిని నేను ఇంతవరకూ ఎప్పుడూ చూడలేదు. ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులివి ఎట్లా అవుతావు?" అని. 


పులి కొంచెం దిగి వచ్చినట్లు "మీ మనుషులందరూ మా జంతువుల్నీ, చెట్లనీ ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు. అందుకని మీలాంటి వాళ్లని ఏం చేసినా పాపం లేదు. ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకునేవు- కానే కాదు- అందరూ ఇదే చెబుతారు. కావలిస్తే ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా ఐదుగురిని అడిగే అవకాశం ఇస్తాను నీకు. అడిగి చూడు- వాళ్ళలో ఏ ఒక్కరు నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను. అడుగు మరి" అన్నది కాలును కొంచెం వదులు చేస్తూ.


బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకొని, దగ్గరలోనే ఉన్న మామిడిచెట్టును ఒకదాన్ని న్యాయం చెప్పమన్నాడు.

 అది "మీ మనుషులు నిజంగానే ఆశపోతులూ, నిర్దయులూనూ. పచ్చి కసుర్లని కూడా చూడకుండా నా కాయలన్నీ‌ కోసుకుంటారు వాళ్ళు. నా ఆకులు పీక్కుంటారు; నా బెరడుమీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు; నేను ముసలిదాన్నయ్యాక వచ్చి నా వ్రేళ్ళతో‌సహా మొత్తానీ ఎత్తుకెళ్ళి తగలబెడతారు. ఈ మనుషులకు అసలు కృతజ్ఞత అన్నదే లేదు. వాళ్లని ఏం చేసినా తప్పులేదు- వాళ్ల ప్రవర్తన అంత నీచం, నిజంగా!" అన్నది.


బ్రాహ్మణుడి ముఖం‌ వాడిపోయింది. ఈసారి అతను ఆ దారివెంట కుంటుకుంటూ‌ పోతున్న ఎద్దునొకదాన్ని పిలిచి న్యాయం చెప్పమన్నాడు. "మనుషులకి అసలు జాలి అన్నదే లేదు. పూర్తిగా స్వార్ధపరులు వాళ్ళు. నా జీవితం అంతా వాళ్ళు నాచేత ఊడిగం చేయించుకున్నారు. అలసిపోయి ఏ కొంచెం ఆగినా, నన్ను తిట్టారు; కొట్టారు; ఇంకా ఇంకా పని చేయించుకుంటూనే పోయారు. ఇప్పుడు, నేను ముసలిదాన్ని అయ్యాక, నా కాళ్లలో‌ బలం తగ్గి కుంటిదాన్నయ్యాక, నన్ను తన్ని తగలేశారు. మనుషుల గురించి చెప్పేందుకు నాదగ్గర ఒక్క మంచిమాటకూడా లేదు" అన్నదది.


బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ముసలి ఆవును అడిగాడు ఆశగా. అదికూడా మనుషుల్ని బాగా తిట్టింది- 'వాళ్లని ఏం చేసినా తప్పు లేదు' అన్నది.

పులి బ్రాహ్మణుడిని చూసి "ఇప్పుడేమంటావు నువ్వు? మీ మనుషులు మా పట్ల ఎంత నిర్దయతో ప్రవర్తిస్తున్నారో అర్థమైంది గదా, ఇక నేను నిన్ను తినచ్చునా?" అన్నది.

అంతలోనే తడుముకుంటూ వెళ్తున్న ముసలి నక్క ఒకటి దాని కంట పడింది. "సరే, నేను నీకు ఇంకో అవకాశం కూడా ఇచ్చేస్తాను- ఐదో సాక్షి ఇటే వస్తున్నది. దాన్ని ఒక్కదాన్నీ అడిగేస్తే నీ పని అయిపోతుంది; అడిగెయ్, దాన్ని!" అన్నదది తొందరపెడుతూ.


ఆ సరికి బ్రాహ్మణుడి ఆశలన్నీ అడుగంటి పోయాయి. అయినా ఏం చేయగలడు, పాపం ఇదే చివరి అవకాశమాయె!


నక్కని దగ్గరికి రమ్మని అరిచింది పులి. నక్క వచ్చింది, అడుగులో అడుగు వేసుకుంటూ. ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగా కనిపించటం లేదు; అయినా అది చాలా తెలివైనది- పరిస్థితినంతా క్షణంలో ఆకళింపు చేసుకున్నది: మనిషి తరపున ఏ కొంచెం మాట్లాడినా పులికి కోపం వస్తుంది- అందుకని ఎవ్వరికీ అసలు నిజం చెప్పే అవకాశం లేనే లేదు-"


అందుకని అది అన్నది "మనుషుల క్రూరత్వాన్ని గురించి నేను కూడా చాలా చెబుతాను. అయితే అసలు ఇక్కడ ఏం జరిగిందో నన్ను ఓసారి అర్థం చేసుకోనివ్వండి ముందు- ముసలితనం కదా, నా మెదడు చురుకుగా ఉండటం లేదు. పైపెచ్చు నా చూపుకూడా సరిగా ఆనటం లేదు ఇప్పుడు. అందుకని దయచేసి ఇక్కడేం జరిగిందో చెప్పండి మెల్లగా- ఆపైన నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికి ఓపికగా జవాబులివ్వండి" అని.


ముందుగా బ్రాహ్మణుడు తను స్నానానికి వెళ్తున్న సంగతీ, పులి పిలిస్తే బోను దగ్గరికి వెళ్లిన సంగతీ, దానిమీద జాలితో తను పులిని విడిపించిన సంగతీ, ఇప్పుడు అది తననే తినెయ్యాలని అనుకుంటున్న సంగతీ చెప్పాడు దానికి.


పులికి ఓపిక బాగా తగ్గిపోయింది. అది మొరటుగా పళ్ళు నూరుతూ "ఇంక చెప్పెయ్ అల్లుడూ! మనుషులంటే నీకు ఎంత అసహ్యమో త్వరగా చెప్పెయ్! నాకు చాలా ఆకలిగా ఉంది!" అంటూ నక్కని తొందర పెట్టింది.


నక్క తల గోక్కున్నది; పులివైపుకు తిరిగి "మామా! నీకు కోపం కలిగించే మాటలేమీ అనను గానీ, ముందు నాకో సంగతి చెప్పాలి నువ్వు. నీ అంత పెద్ద జంతువు ఇంత చిన్న బోనులో ఎలా పడుతుంది? నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్నావన్న సంగతే మింగుడు పడటం లేదు నాకు. ఓసారి చూపించు, ఒక్క క్షణం చాలు- నువ్వు అందులోకి ఎట్లా దూరావు, ఆ గడియ ఎట్లా పడింది?" అన్నది.


పులికి ఓపిక నశించి, కోపం వచ్చేసింది. "నీ అంత ముసలి తొక్కునూ, ఇంత తెలివిలేని నక్కనూ నేను ఎన్నడూ చూడనేలేదు. నేను అందులో ఎలా దూరానో నీకెందుకు ఇప్పుడు? అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యం అవుతుంది తప్ప, వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని చూపిస్తాను- చూడు- బోను తలుపు తెరిచి ఉన్నదిగదా, ఇట్లాగ? నేను ఇట్లా వెళ్ళాను లోపలికి!" అని చటుక్కున బోనులోకి దూరింది. ఇంకా దాని మాటలు పూర్తవ్వకుండానే బోను తలుపు మూసుకుపోయింది; గడియపడిపోయింది! మాటలన్నీ గొంతుకు అడ్డం పడటంతో పులి కాస్తా బిత్తరపోయింది!


నక్క నవ్వుతూ బ్రాహ్మణుడివైపుకు తిరిగి-"ఇప్పుడు పో స్వామీ, నువ్వు పోయి నీ స్నానం కానివ్వు!" అన్నది. బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ 'బ్రతుకు జీవుడా' అని పరుగుపెట్టాడు!


🍁🍁🍁🍁

అంతలో ఒక గాడిద వచ్చిందక్కడికి, గెంతుకుంటూ. ఎందుకంటే దాని ముందరి కాళ్ళు రెండింటినీ కట్టేసి పెట్టాడు, దాని యజమాని! ఇక అది మనుషుల గురించి ఏం చెబుతుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. బ్రాహ్మణుడు ఇంకా తటపటాయిస్తూ‌ ఉండగానే పులి దాన్ని పిలిచి అడిగేసింది- మనుషులకోసం దాని దగ్గర ఒక్క మెప్పుకోలు కూడా లేదు- మనుషులు ఎంత క్రూరులో ఏకరువు పెట్టింది అది.

Monday, 18 January 2021

పందెం


అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.

గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు. 


ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. 

కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు. 

పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. 

అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది. 

గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను. 

గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అ పైన  అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను. 

"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు.

 అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది! 

దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!' 

గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది. 

తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది! 

గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.

🍁🍁🍁🍁


🍁🍁🍁🍁🍁

Sunday, 17 January 2021

బ్రతకడానికి...


ఇద్దరు వ్యక్తులు రెండు వేరు వేరు ఇళ్ళలో ఉండే వాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ మాత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్దమనిషి, మరొకరు ఒక యువకుడు.

ఆ ఇద్దరు ఒకే లాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరు వైపులా పెంచడం మొదలుపెట్టారు.

ఆ యువకుడు చెట్లకి చాలా నీళ్ళు ఎరువు ఇవ్వసాగాడు. కాని, ఆ పెద్దమనిషి కాస్తంత ఎరువు కొన్ని నీళ్లు ఇచ్చేవాడు.

కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారయింది.

ఇక ఆ పెద్దమనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాక పోయిన బలంగా నిండుగా అయింది.

ఒక రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

మర్నాడు ఉదయం ఆ ఇద్దరు వాళ్ళు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూడడానికి బయటకు వచ్చ్చారు.

ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్ళతో పాటు పడిపోయి ఉండడం చూసాడు. కాని ఆ పెద్దమనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగింది అని ఆ పెద్దాయనను ప్రశ్నించాడు.

ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి.

"* చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్నీ అవసరానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ళ కోసమో పోషకవిలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బ్రతకడానికి మాత్రం సరిపడే నీళ్ళు ఎరువు ఇఛ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్ళను భూమి లోతుల వరకు పరిచింది.

నీ వేళ్ళు పైపైన మాత్రమే ఉండడంవల్ల గాలికి తట్టుకుని భూమిలోపల నిలదొక్కుకోలేకపోయాయి.

నా వేళ్ళు భూమి లోతుల వరకు పాకి ఉండటంవల్ల ప్రకృతి విసిరిన సవాలును తట్టుకుని చెట్టు అలాగే  నిలబడగలిగింది.                      


 🌳🌲🌴👶👶👶👶🌴

Friday, 15 January 2021

*ప్రతి ఫలం*


తండ్రీ కొడుకులు కలసి వ్యవసాయం చేసేవారు.

అడిగిన వారికి అన్నం పెట్టి అన్నదాత అనిపించుకున్నాడు. అర్ద రాత్రి ఎవరికైనా జబ్బు చేస్తే, బండి కట్టి పట్నంలో ఆసుపత్రికి చేర్చేవాడు.

తండ్రి పద్దతులు కొడుకు సూరికి నచ్చేవి కావు.

"ఎందుకు పరాయి వాళ్ళ కోసం అలా పాకులాడతావు? మనకు అవసరం  పడితే ఒక్కడూ ముందుకు రాడు. మొన్న నా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఒక్కడూ బండెక్కించుకోలేదు. కృతజ్ఞత లేని వారికోసం పాటుబడటం శుద్ధ దండగ" అని కోపగించుకునేవాడు.


కొడుకు మాటలకు నొచ్చుకుంటూ "ప్రతిఫలం ఆశించి చేసేది సహాయం అనిపించుకోదు." అని సర్ది చెప్పేవాడు.


ఓరోజు సూరి పొలం వెళ్ళే సరికి, ఎవరివో పశువులు తమ పొలం లో పడి మేస్తున్నాయి.

పక్కపొలం  సుబ్బయ్య చూచీ చూడనట్టు వున్నాడు. వళ్ళు మండి తనే తరుము కున్నాడు .


నాలుగు రోజుల తరువాత పంపు విరిగి సుబ్బయ్య పండిన చేలోకి నీరు పోసాగాయి.

అది చూసిన తండ్రి పంపు కట్టేసి రమ్మన్నాడు.


మొన్న జరిగింది చెప్పాడు.

"ఎవడి పాపాన వాడు పోతాడు. కోత కొచ్చిన పంట తడిచిపోతే ,పాడయిపోతుంది చూస్తూ వుంటే వాడికి మనకు తేడా ఏముంది?" కోపంగా అన్నాడు.


తండ్రి చెప్పినట్టే చేశాడు.

ఆ ఏడు పంటలు బాగా పండాయి. వడ్లు బస్తాలకెత్తి , ఇంటికి చేర్చాడు సూరి.

ఊరెళ్ళిన తండ్రి అప్పుడే వచ్చాడు.

ఎద్దుల గంగ డోలు నిమురుతూ"నాన్నా! ధాన్యం బస్తాలు బండికెత్తి దారిన వస్తుంటే, రెండు చక్రాలు గుంటలో ఇరుక్కు పోయాయి. బండి బరువుకు వెనక్కి వాలి ముందు లేచింది. ఎద్దులు పైకి లేచాయి. వాడి కుత్తుకల దగ్గర బిగుసుకుంది. తనకలాడు తున్నాయి. నేనొక్కడినే ఉన్నాను ఏం చేయాలో పాలుపోలేదు.

అంతలో ఆ దారిన పోతున్న పెళ్ళి బృందం, గబగబా వచ్చి,ఎద్దులను పట్టుకుని పైకెత్తారు. నేను వాటి మెడతాళ్ళు తప్పించాను. ఈ రోజు ఎద్దుల ప్రాణాలు గట్టివి"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సూరి.


"చూశావా!భగవంతుడు ఎంత సహాయం చేశాడో! నీవు సహాయం చేసిన వాళ్ళే నీకు సహాయం చేయాలని లేదు. నువు ఎవరికి మంచి చేసినా, దేవుడు నీ ఖాతాలో వేస్తాడు. పెళ్ళి వారికి నువ్వేం సాయం చేశావని వాళ్ళు కాపాడారు. ప్రతి ఫలం ఆశించక పదిమందికి సాయం చేస్తే అదే మనల్ని కాపాడుతుంది."

ఇంతకాలం మొండిగా వాదించి నందుకు  తండ్రి ని మన్నించమని కోరాడు మన సూరి.

Thursday, 7 January 2021

శ్రీకృష్ణ సందేశం 5.2 మహాభారతం


మానవుల అన్ని సంబంధాలకు ఆధారం ఆపేక్ష. భర్త ఎలా ఉండాలి అని అడిగితే నా జీవితాన్ని సుఖసంతోషాలతో నింపేయాలి అంటారు. భార్య ఎలా ఉండాలి అని అడిగితే ఎప్పటికీ నాపై అంకితభావంతో ఉండాలంటారు. సంతానం ఎలా ఉండాలి అని అడిగితే, తమకి సేవచేయాలి, తమ ఆదేశాలు పాటించాలి అంటారు. 

మనుషులు ఎవరిని బాగా ప్రేమిస్తారంటే, తమ ఆపేక్షను పూర్తిచేసేవారిని. అయితే, ఆ ఆపేక్షకు భంగం కలగడమూ మామూలే. ఎలా? 

ఎందుకంటే, ఈ ఆపేక్ష మనుషుల మస్తిష్కంలో జన్మిస్తుంది. ఏ ఇతర వ్యక్తీ వారి ఆపేక్షల గురించి తెలుసుకోలేకపోతాడు. పూర్తి చేయాలన్న తపన ఎంత ఉన్నప్పటికీ మనిషి ఇతరుల ఆపేక్షలను పూర్తి చేయలేకపోతాడు. ఇక అక్కడినుంచే జన్మిస్తుంది 'సంఘర్షణ'

అన్ని సంబంధాలు సంఘర్షణ రూపంలోకి పరివర్తన చెందుతాయి. కానీ మనిషి సంబంధాల ఆధారంగా ఆపేక్షను ఏర్పరచుకోదు. అలాగే స్వీకరించేది కూడా సంబంధానికున్న ఆధారాన్నే. 

అయితే ఈ జీవితం తనకి తానే సుఖశాంతులను నింపుకోలేదా? ఆలోచించండి..:) 

Sunday, 3 January 2021

🍁ఓ పరిష్కారం..🍁



ఏదో పుస్తకం చదువుకుంటున్న తండ్రిని తన వరుస ప్రశ్నలతో విసిగిస్తోంది ఆరేళ్ల పాప. అమ్మాయికి ఏదైనా చెబితే తన జోలికి రాకుండా ఉంటుంది కదా అనుకున్నాడు ఆ తండ్రి. ఇంతలో ఆయనకు ఓ ఆలోచన తట్టింది.

      పుస్తకాల అలమరలోంచి ప్రపంచ పటం బొమ్మను బయటికి తీశాడు తండ్రి. దాన్ని ముక్కలుగా చింపి, కూతురు చేతిలో పెట్టాడు. ‘అమ్మడూ! ఈ ముక్కల్ని సరిగ్గా అతికించి తీసుకురా... నీకు చాక్లెట్‌ ఇస్తా’ అన్నాడు.

      పాప సంతోషంగా ఆ ముక్కలను తీసుకొని తన గదిలోకి వెళ్లిపోయింది. ముక్కలను సరిగ్గా గుర్తించి, అతికించడానికి చాలాసేపు పడుతుంది... అసలు తను అతికించగలదో లేదో అనుకుంటూ మళ్లీ పుస్తకంలో పడిపోయాడు తండ్రి. 

      కానీ, పాప పది నిమిషాల్లో తిరిగి వచ్చింది. చక్కగా అతికించిన ప్రపంచ పటం బొమ్మని నాన్నకి చూపించింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ‘ఇంత తొందరగా ఎలా చేయగలిగావురా’ అని అడిగాడు.

‘నాన్నా... ఈ ప్రపంచ పటం వెనుకవైపు రాముడి బొమ్మ ఉంది. నేను దాన్ని సరిగా అతికించాను. దాంతో ప్రపంచ పటం వచ్చేసింది’ అని నవ్వుతూ చెప్పింది ఆ పాప. తన కూతురు తెలివితేటలకు మురిసిపోయాడు ఆ తండ్రి. 

* * *

      👉ఎంతటి కఠిన సమస్యకైనా ఓ పరిష్కారం అంటూ ఉంటుంది. దాన్ని ఎంత తొందరగా గుర్తించగలం అన్న దానిమీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. 

👉సమస్యకు భయపడి పరిష్కారం వెతికే ప్రయత్నం ఆపేస్తే మాత్రం పరాజయమే మిగులుతుంది.🍁

💕💕💕💕💕💕💕💕💕💕💕💕

ఓ చక్రవర్తి కథ


~~~~~~~~~~~~~~~~~~

చక్రవర్తి. తిరుగులేని అధికారంగల రాజు. ఆయన ఆజ్ఞకులోబడి అశేష సేనావాహిని ఉంటుంది. అందరూ ఆయనకు తలవంచుతారు. ఎంత గొప్పవాళ్ళకయినా కొన్ని సార్లు ఇబ్బందులు వస్తాయి. పరిస్థితులకు తలవంచక తప్పదు. అక్కడ అహంకారం పనిచెయ్యదు. అహంకరిస్తే నష్టం. అట్లాంటి ఒక పరిస్థితి చక్రవర్తి జీవితంలో జరిగింది. ఆ సంఘటన ఆయనలోని ఔన్నత్యాన్ని బయటపెట్టింది.

ఆరోజు దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. చక్రవర్తికి నిద్ర రాలేదు. పైగా దాహం వేసింది. చక్రవర్తి అన్ని అవసరాలు చూసే ఎందరో సేవకులుంటారు. అందువల్ల చిన్నపనులకు కూడా వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారు.

అది అర్ధరాత్రి. అందరూ గాఢనిద్రలో ఉన్నారు.

చక్రవర్తి “ఎవరక్కడ?” అని అధికార స్వరంలో పిలిచాడు. ఎవరూ బదులు పలకలేదు. చక్రవర్తికి దాహం ఎక్కువయింది. ఇంకోసారి పిలిచాడు. జనం అలికిడి లేదు. పడక దగ్గర ఒక నీటిపాత్ర ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అందుకుని చూశాడు. కానీ నీళ్ళు లేవు.

శరీరం నీళ్ళు కావాలంటోంది. సేవకులందరూ నిద్రలో ఉన్నారు. మొదట కాసేపు చక్రవర్తికి ఏంచెయ్యాలో తోచలేదు. నిద్రపోయే జనాల్ని లేపుదామా అనుకున్నాడు. మళ్ళీ ఎందుకులే అనుకున్నాడు. కానీ దాహంగా ఉంది. “సరే! నేనేవెళ్ళి బావిలో నీళ్ళు తోడుకుని తాగితే సరిపోతుంది కదా!” అనుకున్నాడు.

అంతఃపురాన్ని వదిలి బయటికి వచ్చాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. చంద్రుడు, చుక్కలు ఆశ్చర్యంతో చక్రవర్తినే చూస్తున్నాయి. అది ఆయనకు ఒక కొత్త అనుభవం. అటువంటి పరిస్థితి ఎప్పుడూ కలగలేదు.

దగ్గర్లో బావి కనిపించింది. బావి దగ్గరకు వెళ్ళాడు. తాడుకు కట్టిన బక్కెట్‌ కనిపించింది. బక్కెట్‌ తీసి బావిలో ఒదిలి తాడుపట్టుకున్నాడు. కాసేపు ఆగాడు. తనపదవి, తన చక్రవర్తిస్థానం గుర్తుకొచ్చి ఆయనకు నవ్వు వచ్చింది. చంద్రుడు ఉన్నాడు కానీ వెన్నెల కురిసేంతగా కాక మరీ సన్నగా ఉన్నాడు. అందువల్ల కొద్దిగా మసకమసగ్గానే ఉంది.

బక్కెట్‌ను నీళ్ళలో ముంచాడు. పైకి లాగాడు. గిలక శబ్దం చేసింది. మెల్లగా లాగి బక్కెట్‌ పైకి వచ్చాకా దాన్ని అందుకోవాలి. కానీ చక్రవర్తికి అది ఎప్పుడూ చేయని పని. అనుభవంలో లేనిది. తాడును బలంగా లాగాడు. బక్కెట్‌వచ్చి గిలకకు కొట్టుకుంది. నీళ్ళు ఒలికి చక్రవర్తి మీద పడ్డాయి. బక్కెట్‌ తలకు కొట్టుకుంది.

ఆ సంఘటనతో విస్తుపోయిన చక్రవర్తి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆకాశంలోకి చూసి “దేవా! నాకు ఈ అనుభవాన్నిచ్చినందుకు నీకు కృతజ్ఞుణ్ణి, బావినుండి నీళ్ళను తోడడానికి కూడా నేను అసమర్థుణ్ణి, అయినా నాపట్ల దయతో నన్ను ఈ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశావు. నీకు నేను బానిసను” అన్నాడు.

ప్రయాణం 2020 నుండి 2021 వరకు

 అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ, మన జీవితంలో గత ఏడాది మనకు చాలా నేర్పింది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమైంది. రోగనిరోధక శక్తి చాలా అవసరమని తెలిసింది. పోషకాహారం విలువ తెలిసింది. పరిశుభ్రత నేర్చుకున్నాం. పుట్టిన తర్వాత ఎప్పుడూ మనం ఇన్నిసార్లు చేతులు కడుక్కోలేదు. పల్లెటూళ్లలో పుట్టిన వాళ్లకు కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్‌, శానిటైజర్‌, క్వారైంటన్‌, యాంటీబాడీస్‌, ప్లాస్మా, స్ట్రెయిన్‌ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయి.

మొదట్లో నెలరోజులు లాక్‌డౌన్‌ అంటే మనకు పిచ్చిపట్టినట్లయింది. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మానసిక ఆరోగ్యం చాలా అవసరమని తెలుసుకున్నాం. మనలో ఓపిక పెరిగింది. ఎనిమిది నెలలు ఎలా గడిచిపోయాయో మనకే తెలియలేదు. డబ్బు ఉన్నా లేకపోయినా.. ఎలా బతికామో మనకే తెలియదు. నిజమైన స్నేహితులు ఎవరో ఇప్పుడే తెలిసింది. జీవితంలో పొదుపు ఎంత అవసరమో తెలిసొచ్చింది. వర్క్‌ ఫ్రమ్ హోం నేర్చుకున్నాం. ఆడవాళ్లు బంగారం, కొత్త చీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం. అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిళ్లు తగ్గాయి. ప్రకృతి చాలా శక్తిమంతమైనదని తెలిసింది. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది. ఎవరైనా చిన్న సహాయం చేస్తే దాని విలువ మనకు అర్థమైంది

రెండు నిమిషాలు ఊపిరి ఆగితే చాలు ప్రాణాలు పోతాయి.. చావనేది పెద్ద విషయం కాదు’ అనేది తెలిసి వచ్చింది. అనుక్షణం ఒళ్లు దగ్గరపెట్టుకొని బతికాం. జలుబు, జ్వరం కూడా మనం భరించలేని పరిస్థితి వచ్చింది. పసుపు, వెల్లుల్లి, తేనె, కషాయం, ఆవిరిపట్టడం వంటివి మంచివని తెలిసింది. ఆయుర్వేద విలువ తెలిసింది. 2020 మహమ్మారి సంవత్సరం కాదు.. ఇది మేల్కొలుపు సంవత్సరం. అందుకే 2020ని మనం గౌరవించాలి. గత ఏడాది మనకు గురువు. ఏడాది పాటు ప్రపంచాన్ని స్తంభింపజేసి మనందరికీ పాఠం చెప్పింది. ఉత్పాదకత నాశనమైపోయింది. ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. పోతేపోనీ.. బతికున్నాం చాలురా దేవుడా అనే పరిస్థితిలో పెట్టింది. ఇక 2021 ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఇంకా ఎన్ని వైరస్‌లు వస్తాయో తెలియదు. కానీ, 2020 అనుభవం తర్వాత మనం చాలా పరిపక్వత సాధించాం. మనలో ఏదో తెలియని విశ్వాసం వచ్చింది’’.అందుకే జీవితంలో ప్రతి రోజునూ పండగలా జరుపుకోవడం నేర్చుకోండి. గతం మనది కాదు.. భవిష్యత్తు మనది కాదు.. ఈ రోజును మనం ఆస్వాదించామా.. లేదా..! సెలబ్రేషన్‌ అంటే ఏంటి? పని చేయడం, నవ్వడం, ప్రేమించడం, పాడటం, డ్యాన్స్‌ చేయడం. అందరూ జీవితాన్ని సెలబ్రేట్‌ చేసే పనిలో ఉంటే ప్రపంచంలో సగం దరిద్రాలు తగ్గుతాయి. గొడవలుండవు.. యుద్ధాలుండవు.. ఇక నుంచి రెట్టింపు శ్రమిద్దాం. మంచి ఆహారం తిందాం. అరగంటైనా వ్యాయామం చేద్దాం. లేదా కనీసం పది గుంజీలు.. విద్యుత్‌, నీళ్లు, ఆహారం వృథా చేయొద్దు. జంతువుల్లా రోజంతా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుందాం. మొక్కలు, ఆకులు, చెట్లను పలకరిద్దాం. స్నేహితులతో కలిసి కాసేపు నవ్వుకుందాం. బతికిన ప్రతిరోజూ ఇలా సెలబ్రేట్‌ చేసుకుంటూ పోవడమే.. ప్రతిరోజునూ పండగ చేసుకుంటూ ఆస్వాదిద్దాం.

ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి. బోలెడంత సంతోషాన్నివ్వాలి 💐.